మా తాతమ్మ జీవితం లో సక్సెస్ శాతం ఎంత? ఏమో ?

ఒక్కొక్కరిది ఒక్కో కధ . ఒక్కో వ్యధ . ఇది మా తాతమ్మ కధ. ఒక గాధ .

ఆ రోజు తాతమ్మ పుట్టినరోజు మే ఎనిమిదవ తారీఖు . అందరం కలిసి ఆమెతో కేకు కట్ చేయించాము

విందు భోజనం చేసాము . సందడి గా , సంతోషం గా గడిచింది .

నేను ఆమె దగ్గర కి వెళ్లి  గత జ్ఞాపకాల దొంతరను విదిల్చాను . 

ఆమె మనసు పొరల్లో ఉండిపోయిన స్మృతులు  ఒక్కసారే అన్నీవర్షం లాగ కురిశాయి.

ఆ వడగళ్ళ ని జాగ్రత్తగా సీసాలో పట్టి పెడదామనే నా ఈ ప్రయత్నం .

అవి  ఆమె మాటల్లో నే—

నేను నా తల్లి దండ్రులకు ఒక్కతే కూతుర్ని .. ఆడింది ఆట పాడింది పాట అన్నట్లు చాలా గారాబంగా పెరిగాను.  మరి రెండో సంబంధం ఎందుకు  ఇచ్చారో తెలియదు, గుర్తుకు రావటం లేదు.

ఏడు వారాల నగలతో , చీనీ చీనాంబరాలు, పట్టు పీతాంబరాలు ( వెండి అంచు, బంగారం పువ్వు గల పట్టు వస్త్రాలు)  తో  అత్తింటికి వచ్చాను.

 అప్పటికే  ఇంట్లో   మొదటి భార్య పిల్లలు ఇద్దరు , భర్త ను పోగొట్టుకున్న పెద్ద ఆడబడుచు, ప్రతిదానికీ పేచీ పెట్టుకొని  పుట్టింటికి వచ్చే చిన్న ఆడబడుచు , ఆరుగురు మరుదులు , అత్తా, మామా, గొడ్లు , గోదాములు , పురులు, మామిడి తోటలు -ఒకటేమిటి  అన్నీ చూసాను.

దానాలు, ధర్మాలు, బంధుబలగం , పేకాట , త్రాగుడు , గొప్పలు . ఇవ్వన్నీ మనుషుల కు కొంతవరకు ఉండవచ్చు కానీ అదే  పని గా ఉండకూడదు.

అతి తాగుడు కి బానిస అయ్యి మా వారు కాలం చేసారు  

చివరకి మామగారు, సవతి పిల్లలు , మరదులు, పేకాట తో సర్వం నాశనం అవటం కూడా చూసాను .ఇల్లు, పొలాలు  నగలు ,పట్టు చీరలు, వెండి కంచాలు, వెండి గ్లాసులు , ఇత్తడి సామాను అన్నీ అమ్మేసారు

పుట్టింటికి పోవాలంటే అప్పటికే ఆరుగురు బిడ్డలు , వీళ్ళని తీసుకొని అక్కడకి వెళ్ళాలంటే సిగ్గుగా అనిపించింది. ఎందుకో నాకు భయం , దిగులు, పిరికితనం ఉండేవి కావు. ఆత్మాభిమానం ఉండేది .

మా నాన్న ఇచ్చిపోయిన  నాలుగు  గేదెలు , కొంచెం డబ్బుతో  చిన్నగా పాలు పితికి, నాలుగిళ్లలో అమ్మి ఇంతమందిమి కడుపు నింపుకొని,   నాలుగు ఎకరాలు పొలం, ఒక ఇల్లు కట్టుకొని ఇదిగో మీ అందరితో ఇలా ఉన్నాను.  కొడుకులు విదేశాలు చూపించారు. కోడళ్ళు బంగారాన్ని మెడలో దిగేశారు.

 ఇంకా ఈ జీవితం లో నాకేమి కావాలి ? పసుపు పచ్చని నూలు చీరలో చాలా అందం గా కనిపించింది తాతమ్మ.

చిన్నప్పుడే  భర్తని పోగొట్టుకొని ఆరుగురు పిల్లలను  ఒక ఉన్నత స్థితి కి తెచ్చిన ఆత్మ విశ్వాసం ఆమె కళ్ళల్లో తొణికిసలాడుతున్నది .

ఆమె పిల్లలను  పల్లెత్తు మాట అనకుండా పెంచడం చుట్టాల్లో పక్కాల్లో ఒక పెద్ద చర్చ అయింది.

 పిల్లల కోసమే జీవితం అన్నట్లు బతికింది .అందులోనే ఆనందాన్ని పొందింది . అది ఆమె విజయం అనుకోవాలా లేక ఏ  వయసులోవచ్చే ముచ్చట్లు ఆ వయసులో ఆమె అనుభవించలేదు అని చెప్పాలా లేక

అలా ఇంటికి ఒక స్తంభం లాగ నిలబడి అందరి జీవితాల లో వెలుగు నింపింది అనుకోవాలో తెలియదు . తాతమ్మ కి కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు , మనవరాళ్ళు  ముని మనవళ్ళు , ముని మనవరాళ్ళు యింతమంది వున్నారు . ఆమె అన్నీ తరాలు చూసింది .  మా తాతమ్మ ఈ మధ్యనే తన తొంభై ఆరవ ఏట తనువు చాలించింది.

ఆమె జీవితం వంద  శాతం సక్సెస్ అనుకుంటున్నాను .

తెలుగులో వ్యాసాలు

తెలుగులో క్విజ్

తెలుగు స్టోరీస్

టీనేజ్ పిచ్చాపాటి చాటింగ్ తెలుగు స్టోరీ

భగవంతుడా కరోన పోయేకాలం? తెలుగు స్టోరీ

ఆయన మంచేగా చెప్పారు ? తెలుగు కధ

బామ్మ బెంగ – మనవరాళ్ళ ప్రేమ తెలుగులో కధ 

ఆనందమే అందం అందమైన తెలుగు కధ 

అత్తమ్మా-ఏంటిది ? తెలుగులో కధ

సరిత మనసు సరితదే ఒక మనసు కధ

తాతయ్య టీగోల మనవడి స్వీట్లతో పేచి

టచ్ ఫోన్ టచ్ చేయకుండా ఒక్కరోజు అంతా…

తెలుగులో వ్యాసాలు

తెలుగులో బ్లాగ్