ఈ “కారం” మమకారమా !!

తల్లి చేనులో మేస్తుంటే పిల్ల చేను గట్టు మీద మేస్తుందా ఏమిటి?

నువ్వు సీరియల్స్ చూస్తావాయే , పిల్లలని ఆ గదిలో కూర్చోబెట్టి ఆన్ లైన్ పాఠాలు వినమంటావు ,

వాళ్ళు ఎట్లా చదువుతారు ? ప్రశాంతంగా ఉంటేనే బుర్ర పనిచేసి చావడం లేదు! 

అట్లాంటిది అంత  సౌండ్ పెట్టుకొని  టీవీ లో నువ్వు చూసేవి నీతిభోధకాలా ?

కొత్త కోడలు ఇంటికిరాగానే గొంతు పిసకడం, ఇంట్లో నుంచి నువ్వు వెళ్లి పో అనడం ఛీఛీ ఏమి సీరియల్స్ ఇవి , మళ్ళీ పేరుకు సెక్షన్ఆఫీసర్ వి అంత చదువు కున్నదానివి ,నీకు నేను చెప్పాలా?

అత్తగారు అన్నారని అని నన్ను ఆడిపోసుకుంటారు అందరూ మళ్ళీ ,…..పచ్చడి చేయటానికి గోంగూర కాడలు తీస్తూ అన్నది అత్త శారద .

అబ్బబ్బ ప్రతి రోజు ఇదే గోల . ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కాస్త కాఫీ ఇద్దాము , ఆఫీస్ లో సంగతులు గురించి తెలుసుకుందాము అని లేదు , ఏదో టైం పాస్ కి, కాస్త రిలాక్స్ అవుదామని టీవీ  పెట్టుకుంటున్నాను అంతే . అసలు ఇంట్లో ఉండబుద్ది కావడం లేదు. మైండ్ పోతున్నది  కోపం వచ్చింది కోడలు ఇందిర కి.   

అవును నాకే ఉండబుద్ది అవుతున్నది , విసుకూ విరామం లేకుండా ఇంట్లో గాడిద చాకిరీ చేస్తున్నాను

వాడేమో ఫ్రెండ్స్ , చీట్లపేకలు అని ఆలస్యం గా వస్తాడు .

నువ్వేమో రాత్రి పదకొండు దాకా టీవీ ముందు కూర్చుంటావు .పొద్దున్నే ఆదరాబాదరాగా లంచ్ బాక్స్ లు  తీసుకొని పరుగెడతారు ఇద్దరూ

మధ్యలో నేను నలిగిపోతున్నాను . రోజంతా పిల్లల అల్లరిని భరించలేక పోతున్నాను.

ఈ వయసులో ఒకరు చేసిపెడితే తిని  ప్రశాంతంగా బతకాలి కాని ఈ గోల ఏంటి నాకు ? సూటిగా అడిగింది శారద 

ఈ కరోనా కష్టకాలం  వచ్చింది కాబట్టి గాని లేకపోతే వాళ్ళ స్కూలు , ట్యూషన్లు వాళ్ళ  వ్యాపకాలు  వాళ్ళకి ఉంటాయి .

దయచేసి కాస్తంత ఓపిక తెచ్చుకోండి అత్తయ్యా , మీరు కూడా కాసేపు సీరియల్స్ చూడటం అలవాటు చేసుకోండి . మనసు హాయి గా ఉంటుంది .

ఏంటి హయిగా ఉండేది నాకు చిర్రెత్తుకొస్తుంది అలా మాట్లాడకు విసురుగా అన్నది శారద

 ఇంకెంత కొన్ని రోజులే . మీరు మీ చిన్నకొడుకు దగ్గరకి వెలుదురు గాని ప్రాధేయ పడింది ఇందిర .

ఆలోచనలో పడింది శారద . చిన్నకొడుకు దగ్గర  కి వెళ్ళినా  ఇదే గోల ఇక్కడ ముగ్గురు పిల్లలు , అక్కడ ఇద్దరు పిల్లలు  ఒక రామాయణం లేదు , మహాభారతం లేదు. ప్రవచనాలు వినటం లేదు అస్తమానం పని …. పని….

ఉదయం నుంచీ ఆలోచిస్తున్నది శారద ,… ఈ ఇంట్లోనుంచి ఎట్లా బయటపడాలి ? ఈ బంధాల నుంచి ఎలా తప్పుకోవాలి ? ఎన్ని రోజులు ఇక్కడ పని చేయాలి? ఇలా చచ్చిందాక ఉండాల్సిందేగా ఈ ఇంట్లో బందిఖానా లాగ .

ఆమె ఆలోచనల తెర కు అడ్డుకట్ట లాగా మనవడి గొంతు వినబడింది

బామ్మా అమ్మ  కొడుతున్నది చూడు,  మనవడు ఏడుస్తున్నాడు ఇందిరకి ఏమయిందో పిల్లవాడి మీద చేయి చేసుకుంటున్నది . వాడు ఏడుస్తూ అరుస్తున్నాడు. గబ గబా వెళ్లి వాడిని గుండెకు హత్తుకుంది.

నీ మొగుడిని అను అంతే కానీ నీ కోపం చిన్న పిల్లల మీద కాదు చెబుతున్నాను , వాళ్ళ ని ఏమన్నా అన్నావంటే చూడు ఏమి చేస్తానో  ఒక్కసారిగా తారాజువ్వలాగా  లేచింది శారద. వాడిని ఓదార్చి  తన గదిలోకి తీసుకెళ్ళింది  

తన ప్రవర్తన తనకే ఆశ్చర్యం అనిపించింది . పిల్లలి మీద మమకారం తగ్గిందాక ఇంతే .

ఉప్పు , కారం తిన్నంతవరకూ ఈ మమకారం తగ్గదు

ఒక్క శారదే కాదు , లోకంలో మమకారం లేని తల్లి ఉండదు కదా

ఈ కారం అనే మమకారం తగ్గదు , అమ్మమనసు  ఉన్నంతవరకూ ఉంటుంది,.. ఉండాలి కూడా .